టీడీపీ కార్యకర్తలందరికి అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే షాజహానబాషా హామీ ఇచ్చారు. ఆదివారం మదనపల్లె స్థానిక సుభాష్ రోడ్డులోని ఎమ్మెల్యే నివాసం వద్ద మూడు మండలాలు, పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా టీడీపీ నాయకత్వం లేకపోవడంతో కార్యకర్తలు ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు ఎదుర్కొన్నారన్నారు. ప్రతి మండలంలో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వారి సమ స్యలు తెలుసుకుంటామన్నారు. సరిగ్గా ఏడాది క్రితం అంగళ్లులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేశారని గుర్తుచేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఆయన అనుకుంటే ఆ నాటి ఘటనలో నిందితులను ఇప్పటికిప్పుడే వెంటనే అరెస్టు చేయించవచ్చన్నారు. కాని సీఎం చంద్రబాబు సంయమనం పాటిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు తేలిన వైసీపీ నాయకుల భూకబ్జాలు కేవలం 10శాతమే అని ఇంకా 90శాతం భూకబ్జాలు బయటపడతాయన్నారు. టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వారికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉద్యోగాలు ఇస్తామని, దీంతో పాటు రూ.10కోట్ల ఎనఆర్‌ఈజీఎస్ నిధులతో రోడ్ల పనులను కార్యకర్తలకు అప్పగిస్తామన్నారు. నాణ్యతగా పనిచేసి వారి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కొంత మంది వైసీపీ నాయకులు తనతో మాట్లాడుతున్నారే కాని, తాను మొదటి ప్రాధాన్యత టీడీపీ నాయకులకే ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టతకు పనిచేయాలని, ఇక్కడ గ్రూపులు లేవన్నారు. మదనపల్లెకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నితినగడ్కరీకి విన్నవించామన్నారు. హౌసింగ్ కాలనీలో, టిడ్కో ఇళ్లను మరో రెండు నెలల్లో చంద్రబాబు చేతుల మీదుగా అప్పగిస్తామన్నారు. వైసీపీ నాయకుల కబ్జాలను అడ్డుకుని, పేదల భూములను తిరిగి వారికే అప్పగిస్తామన్నారు. ఈ సమావేశంలో టీ ఆర్‌జే వెంకటేష్, ఎస్‌ఏ మస్తాన, విద్యాసాగర్, నాగార్జునబాబు, షంషీర్, బాబా ఫకృద్దీన, జేవీ రమణ, సుధాకర్, ప్రభాకర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.