జీఓ117 ఆధారంగా టీచర్లను పనిసర్దుబాటు చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప నగరం ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగించే జీఓ 117ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పిన విద్యాశాఖమంత్రి నారాలోకేశ్ అదే జీఓ 117 ఆధారంగా టీచర్ల సర్దుబాటు చేయడం ఏ మాత్రం సమంజసంకాదన్నారు. పదిమందిలోపు విద్యార్థులున్న ధార్మిక పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారని పాఠశాలలను మూసివేయడం వల్ల పేద బలహీన వర్గాలకు చెందిన పిల్లలు విద్యకు దూరమవుతారన్నారు. తక్షణం ఈ ఆలోచన ఉపసంహరించుకోవాలని డిమమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాదర్‌బాషా, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు క్రిష్ణారెడ్డి, గురయ్య, భాస్కర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలజోజి, అబ్దుల్‌సత్తార్ పాల్గొన్నారు.