ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వానికి మంచి ఆదరణ లభించింది. ఏకంగా పది లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారు. దీంతో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదుకు గడువు మరింత పొడిగించారు. దీంతో మరింత మంది క్రియాశీలక సభ్యులుగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.గ్రామాల్లో జనసేన పార్టీని క్షేత్ర స్థాయి వరకు బలంగా విస్తరించాలని నిర్ణయించుకోవడం వంటి కారణాలతో వైసీపీ నేతలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందనే యోచనలో పలువురు వైసీపీ నేతలు ఉన్నారని సమాచారం. దీంతో జనసేనలో చేరికకు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. వీరిలో పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఉన్నారని చెబుతున్నారు.