వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేత ద్వారంపూడి కుటంబం రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రూ.1800 కోట్లు ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి మరీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాల్లోనే బియ్యం రీ-సైక్లింగ్ చేశారని చెప్పారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు పదవులు తెచ్చుకుని.. రేషన్ బియ్యం మాఫియాకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సి ఉంటుందని చెప్పారు. సోమవారం నాడు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక విషయాలపై కలెక్టర్లను ప్రశ్నించారు. రేషన్ డిపోల్లో గతంలో రకరకాల నిత్యావసరాలు అందించామని తెలిపారు. వివిధ శాఖలపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై చంద్రబాబు కీలక సూచనలు ఇచ్చారు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక జేసీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో చాలా కాలంగా ఉన్న విధానం మంచిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో డబ్బులు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉండకూడదన్నారు. రైతు సంక్షేమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు.