మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని.. గ్రామాల్లో చెరువులను.. కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మత్స్యకారుల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచడం, మత్స్య సంపద పెంచే అంశంపై అధ్యయనం చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో జనాభా సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉందన్నారు. యువత తగ్గిపోతోందన్న సర్వేలు వస్తున్నాయన్నారు. ఇద్దరి పిల్లలకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉందని.. ఇలాంటి నిబంధనలను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగదల అవసరమని చెప్పుకొచ్చారు. పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తోందని మంత్రి వెల్లడించారు.