పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎలాంటి పదవులు ఆశించడం లేదని, ప్రజలకు మంచి జరగాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొంత మంది వాటిని కొట్టిపారేయగా మరికొంతమంది నిజమే అంటూ నియోజకవర్గంలో చర్చించుకున్నారు. అయితే తాజాగా పెండెం దొరబాబు ప్రకటనతో ఉత్కంఠకు తెరదించినట్లయ్యింది. టీడీపీ, జనసేన, బీజీపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో తాను చేరుతానని మాజీ ఎమ్మెల్యే దొరబాబు స్పష్టం చేశారు. అన్నీ పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో 25ఏళ్లుగా మమేకమై ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తన వెంట ఇప్పటివరకూ నడిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని చెప్పారు. పిఠాపురంలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.