ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చిస్తారని చెప్పారు. ఈ నెల 12న ఆర్టీసీ, రవాణా శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారని పేర్కొన్నారు.గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. రవాణా శాఖలో కొందరు అధికారుల చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలివెళ్లాయని అన్నారు.అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కారుణ్య నియామకాలపై చర్చించామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తెస్తామని అన్నారు. ఆర్టీసలో 7వేల మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు. కొత్త నియామకాల అంశాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని పేర్కొన్నారు.