తిరుమలలో రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. రాకేష్ అనే వ్యక్తి కొండపై ఉన్న గోగర్భం డ్యాం దగ్గర ఉన్న ఓ మఠంలో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. తన భర్త రెండో పెళ్లి సమాచారం తెలియడంతో మొదటి భార్య సంధ్య తిరుమలకు వచ్చింది. ఆమెను చూసి వరుడు కల్యాణ మండపం నుంచి పారిపోగా.. అక్కడ కొంతమందిని సంధ్య కుటుంబసభ్యులు పట్టుకుని తిరుమల పోలీసులకు అప్పగించారు.
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవోల్ల రాకేష్‌కు.. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలకు చెందిన సంధ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 7 ఏళ్ల కూతురు కూడా ఉంది.. భార్యాభర్తల మధ్య 2021 నుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విడాకుల పంచాయితీ కోర్టుకు చేరింది.. హన్మకొండ కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే ఈలోపు రాకేష్ రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధం కావడంతో మొదటి భార్య సంధ్యకు సమాచారం తెలిసింది. తిరుమలలోని సిద్ధేశ్వరమఠంలో జరుగుతున్న రెండో పెళ్లిని అడ్డుకుంది. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పెళ్లిని ఆపేసింది.
రాకేష్ నుంచి తాను విడాకులు తీసుకోలేదని.. ఆయన తిరుమలలో రెండో వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం తెలియడంతో తాను వచ్చానన్నారు సంధ్య. రాకేష్‌తో విడాకుల వ్యవహారం కోర్టులో కేసు నడుస్తోందని.. అయినా ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని తిరుమల వచ్చి వివాహం ఆపేశానని.. తనతో పాటు కుమార్తెకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ రెండో పెళ్లి వ్యవహారంపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
తనకు రాకేష్‌తో వివాహంకాగా.. ఏడేళ్ల పాప కూడా ఉందని.. తమ విడాకుల కేసు కోర్టులో విచారణ దశలో ఉందంటున్నారు సంధ్య. తనకు విడాకులు ఇవ్వకుండానే.. ఇచ్చానని అబద్దం చెప్పి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యారని ఆరోపించారు. తాను భర్తతో కలిసి ఇంట్లో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని.. కానీ కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపారని చెప్పుకొచ్చారు. తమను చంపుతామని బెదిరిస్తున్నారని.. రాజకీయంగా పలుకుబడి ఉందని, డబ్బు బలం ఉందన్నారు. మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతో తాను తిరుమలకు వచ్చి పెళ్లి ఆపేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో రాకేష్‌తో రెండో పెళ్లికి సిద్ధమైన వధువు కుటుంబ సభ్యులు, బంధులు కూడా అవాక్కయ్యారు. తిరుమలలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది.