ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల మూడు నెలల వేతన బకాయిల చెల్లింపులకు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. కేంద్రం వేతన బకాయిల కింద రూ.2,300 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది మే నెల నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు.. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల బకాయిల విషయాన్ని ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కూలీల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా.. నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలకు రెండు, మూడు రోజుల్లో డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేయనున్నారు.
కేంద్రం గ్రామాల్లో వలసలు నిరోధించడానికి, పనులు లేని సమయంలో కూలీలకు పనులు చూపడానికి ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ ఉపాధి హామీ పథకం పనులు చేసిన 21 రోజుల్లోగా వేతనం చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వేతనాల చెల్లింపు ఆలస్యం అవుతోంది. ఉపాధి హామీ కూలీలు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పలు పనులు చేపట్టారు.. పంట కాలువల్లో పూడిక తీతలు, గుర్రపు డెక్్క తొలగింపు, నీటి కుంటల తవ్వకం, చెరువులో గట్లు వంటి పనులు చేశారు. అయతే ఎన్నికల కోడ్ రావడంతో వేతనాల చెల్లింపు ఆగిపోయింది.
కూలీల సొమ్ము క్రమం తప్పకుండా బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేసేవారు.. సార్వత్రిక ఎన్నికల కారణంగా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆగిపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా బిల్లులను నిలుపుదల చేశారు. ఏప్రిల్ నెల నుంచి చేసిన పనులకు డబ్బులు జమ కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వేతన బకాయిలు విడుదలయ్యే చర్యలు తీసుకోవాలని కూలీలు రిక్వెస్ట్ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో బకాయిలు విడుదల చేసింది కేంద్రం.
ఇదిలా ఉంటే.. కేంద్రం ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరో శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ పని దినాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 21.5 కోట్ల పనిదినాలకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్ని కేంద్రం ఆమోదించింది. రాష్ట్రంలో మొత్తం 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయగా.. వెంటనే స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధి హామీ పని దినాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై.. ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.