గత కొన్ని రోజులుగా స్కూల్లలో జరుగుతున్న దారుణాలు చూస్తూనే ఉన్నాం. పిల్లలతో చాకిరీ చేయించుకోవడం, విద్యార్థులతో ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వారిపై ఉన్నతాధికారులు వేటు వేస్తూనే ఉన్నారు. మరికొన్ని ఘటనల్లో పోలీసులు అరెస్ట్ కూడా చేసి జైలుకు పంపిస్తూనే ఉన్నారు. అయినా కొందరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియో తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ విపరీత చర్య చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువు చెబుతున్న మహిళా టీచర్‌పై అదే స్కూల్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే ఆమె స్కూలుకు వచ్చినట్లు అటెండెన్స్ వేయాలంటే తనకు ముద్దు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా చేస్తేనే అటెండెన్స్ వేస్తానని మెలిక పెట్టాడు. అయితే ఆ కామ ఉపాధ్యాయుడి బెదిరింపులను బాధిత లేడీ టీచర్ తన ఫోన్లో వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడిపై తీవ్రంగా మండిపడుతున్నారు.
తోటి మహిళా టీచర్‌పై ఇలాంటి వేధింపులకు పాల్పడిన ఈ ఉపాధ్యాయుడి తీరుపై ఆ స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన విధులకు సంబంధించిన హాజరు శాతం విషయమై.. తన తోటి ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లింది. తన అటెండెన్స్‌కు ఆమోదం తెలపాలని కోరగా.. ఒక షరతు విధించాడు. నీకు హాజరు వేయాలంటే నాకు ఒక కండీషన్ ఉందని పేర్కొన్నాడు. అది చాలా సరదాగా ఉంటుందని.. పైగా చాలా సులువుగా అయిపోతుందని మెల్లగా చెప్పాడు. అంతటితో ఆగకుండా అతడి చెంప చూపిస్తూ.. ముద్దు కావాలి అని సిగ్గు పడుతూ, మురిసిపోయాడు. అందుకు నిరాకరించిన మహిళా టీచర్.. దానికి తాను అంగీకరించనని.. ఇది చాలా దరిద్రమైన పని అని బదులిచ్చింది.