వివాహ బంధాలను కొందరు కాలరాస్తున్నారు. పెళ్లిలో చేసిన ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైపోతున్నారు ప్రబుద్ధులు. మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విషయం తెలిసిన మొదటి భార్యలు.. భర్తలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాకుండా గుణపాఠం చెబుతుంటారు. తమ జీవితంలా మరొకరి జీవితం నాశనం కాకుండా అడ్డుకుంటుంటారు. పోలీసుల సహాయంతో నిత్య పెళ్లికొడుకులకు బుద్ధివచ్చేలా చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. మొదటి భార్యకు తెలియకుండా రహస్యంగా రెండో వివాహానికి సిద్ధమైన భర్త గుట్టును రట్టు చేసింది భార్య. తిరుమలలోని గోగర్భం డ్యాం వద్ద వున్న ఓ మఠం వద్ద వివాహ వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన రాకేష్ రెండో పెళ్ళి చేసుకున్నేందుకు యత్నించాడు. విషయం తెలిసిన మొదటి భార్య సంధ్య హుటాహుటిన అక్కడకు చేరుకుని వివాహాన్ని నిలిపివేసింది. కళ్యాణ మండపం వద్దకు సంధ్య రావడంతోనే రాకేష్, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై తిరుమల పోలీసు స్టేషన్లో మొదటి భార్య సంధ్య ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.