అబ్బాయిది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు. అమ్మాయిది కర్ణాటక రాష్ట్రం బైనహళ్లి. పెళ్లయింది బుధవారం ఉదయం చంబరసనహళ్లి గ్రామంలో. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే గదిలో నవదంపతుల మధ్య ఏం జరిగిందో కానీ.. కొడవలి దాడితో వధువు మృతి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరుడు.. గురువారం ఉదయం అసువులు బాశాడు. వీరి మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వధువు వాట్సాప్ చాటింగ్ కారణమని కొందరు.. అతడి మానసిక స్థితి సరిగాలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. శాంతిపురం మండలం సంతూరు గ్రామానికి చెందిన జయమ్మ, మునెప్ప దంపతుల కుమారుడు నవీన్ (30) సోదరికి కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ తాలూకా చంబరసనహళ్లికి చెందిన వ్యక్తితో వివాహమైంది. రామకుప్పం, శాంతిపురం మండలాల మధ్య.. కర్ణాటక సరిహద్దు గ్రామమైన రాజుపేటక్రా్‌సలో నవీన్ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బైనహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె నిఖితశ్రీతో నవీన్‌కు బుధవారం ఉదయం చంబరసనహళ్లి (వరుడి సోదరి గ్రామం)లో వివాహమైంది. నవదంపతులిద్దరూ బంధువులతో కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు. ఆ తర్వాత నిఖితశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులను గ్రామంలోని తన అక్క ఇంటికి నవీన్ తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత నవదంపతులు ఓ గదిలోకి వెళ్లారు. కొంతసేపటికే వారి గదిలో నుంచి కేకలు వినిపించాయి. నవీన్ మేనకోడలు కిటికీలో నుంచి చూడగా నిఖితపై అతడు కొడవలితో దాడి చేయడం కనిపించింది. వెంటనే నిఖిత తల్లిదండ్రులు, ఇతర బంధువుల గది తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. అప్పటికే నిఖిత రక్తపుమడుగులో.. పక్కనే నవీన్ తీవ్రగాయాలతో పడున్నారు. వీరిద్దరినీ కోలారులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే నిఖిత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నవీన్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అండర్‌సన్ పోలీసులు తెలిపారు. కాగా, ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్న నవీన్.. భార్యను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడటంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా నవీన్ మానసిక పరిస్థితి సరిగాలేదని, దీనివల్లే ఈ ఘటన జరిగి ఉండచ్చొని కొందరు చెబుతున్నారు. వధువు సెల్‌ఫోను చాటింగే కారణమని అతడి సన్నిహితులు చెబుతున్నట్లు తెలిసింది. పెళ్లయిన కొద్దిసేపటికే నిఖిత సెల్‌ఫోనులో చాటింగ్ చేయడాన్ని అతడు గమనించాడని అంటున్నారు. అనుమానంతో ఆమె ఫోను తీసుకుని చూడగా ఓ యువకుడితో చాట్ చేసినట్లు గుర్తించాడని చెబుతున్నారు. దీంతో గదిలోకి వెళ్లగానే దీనిపై ప్రశ్నించడం.. ఆ నేపథ్యంలోనే ఆమెపై దాడి చేసి హతమార్చి.. తానూ ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని భావిస్తున్నారు. జనసేనలో క్రియాశీల కార్యకర్తగా, సౌమ్యుడిగా పేరున్న నవీన్ జీవితం విషాదాంతం కావడం స్థానికులను బాధకు గురిచేసింది. సున్నిత మనస్కుడైన ఇతడు.. ఎవరికీ హాని కలిగించే మనస్తత్వం కాదని స్నేహితులు, జనసేన శ్రేణులు చెప్పారు. అలాంటి వ్యక్తి ఎందుకిలా చేశాడో అర్థం కావడంలేదన్నారు. కాగా నిఖిత అంత్యక్రియలు బైనహళ్లిలో, నవీన్ అంత్యక్రియలు చంబరసనహళ్లిలో జరిగాయి.