విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలంలో రెల్లివలస గ్రామానికి చెందిన పతివాడ షణ్ముఖరావు అనే యువకుడిపై డెంకాడ మండలంలో గల మహంతిపేటకు చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి సుమారుగా 11గంటల ప్రాంతంలో యువకుడు మహంతిపేట వెళ్లగా అక్కడివారు కొందరు ఇతడిపై దాడిచేసి అతిదారుణంగా కొట్టారని తెలిపారు. రాడ్లతో కాళ్లు, చేతులపై కొట్టారని, తరువాత మండలంలో పాతకొప్పెర్ల, రెల్లివలస వెళ్లేదారిలో పడేసి వెళ్లిపోయినట్టు తెలిపారు. గాయాలతో బాధితుడు రెల్లివలస చేరగా వైద్యం నిమిత్తం విజయనగరంలో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చామన్నారు. బాధితుడు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. దీనిపై స్థానిక ఎస్ఐ సన్యాసిరావును అడుగగా ఇది మహంతిపేటలో జరిగిందని అక్కడే కేసును నమోదు చేస్తారని, తదుపరి దర్యాప్తును నిర్వహిస్తారని తెలిపారు.