ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఉత్తరాంధ్రకు చెందిన చింతకాయల అయ్యనపాత్రుడిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని రాయలసీమకు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీ మంత్రివర్గంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. పెనుకొండ ఎమ్మెల్యే సవిత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లతో పాటుగా రెండు ఎంపీ సీట్లను సైతం టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు పదవుల్లో ప్రాధాన్యం లభిస్తోంది.
మరోవైపు కాల్వ శ్రీనివాసులు 1999లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999 ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో అనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కాల్వ శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనంత వెంకటరామిరెడ్డి ఆయనపై విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాల్వ శ్రీనివాసులు విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే పోటీచేసి ఓడిపోయిన ఆయన.. 2024లో మరోసారి రాయదుర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి పార్టీ విజయం కోసం పనిచేస్తున్న కాల్వకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.