దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తి ప్రమేయం.. మరో ప్రాణం తీసింది. భార్య, స్నేహితుడు కలిసి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక హరిప్రకాష్ అనే ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న హరి ప్రకాష్.. తన బాధలు చెప్పుకున్నారు. తన బాధను వివరిస్తూ ఆత్మహత్యకు ముందు హరిప్రకాష్ రాసిన ఆరు పేజీల వాంగ్మూలం కన్నీరు తెప్పిస్తోంది. హరిప్రకాష్ రాసిన ఆత్మహత్య లేఖలోని వివరాల ప్రకారం.." ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే హరిప్రకాష్ అనే వ్యక్తికి గతంలోనే వివాహం జరిగింది. అయితే అభిప్రాయ భేదాలతో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత భువనేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆవిడకు కూడా ఇది రెండో వివాహమే. అయితే తన భార్య, స్నేహితుడు కలిసి తనను మోసం చేశారని, వారిద్దరి మధ్య అఫైర్ నడుస్తోందని ఆరోపిస్తూ జయప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
"నాకు, నా మొదటి భార్యకు గొడవలకు కారణం కూడా భువనేశ్వరి.తన వల్లే నాకు విడాకులు వచ్చాయి. భువనేశ్వరి వాళ్ళ అమ్మ సత్యవతి భర్తను వదిలేసి గాజువాకలో నివసిస్తున్నారు. నాకు కూడా ఫోన్ చేసి మా అమ్మాయిలతో మాట్లాడమని, కలవమని(శారీరకంగా) చెప్పేవారు. వాళ్ళ తమ్ముడు మాకు కాపలా కాసేవాడు. ఇదంతా నా మొదటి భార్యతో గొడవలు పడిన తర్వాత జరిగింది. మా అమ్మాయిని పెళ్లి చేసుకో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని నన్ను నమ్మించి.. భువనేశ్వరికి, నాకు సత్యవతి పెళ్లి చేశారు. ఎలాంటి కట్నం లేకుండా సొంత డబ్బులతో అన్నవరంలో 2019లో పెళ్లి చేసుకున్నాం. 2020లో మాకు పాప పుట్టింది. అయితే రెండేళ్లుగా నాకు, నా భార్యకు గొడవలు జరుగుతున్నాయి" అని హరిప్రకాష్ లేఖలో రాసుకొచ్చారు.
అయితే తన భార్య భువనేశ్వరికి, తన బావ అకౌంట్లోకి డబ్బులు వేసేవారని.. తాను ప్రశ్నిస్తే ఫోన్ ఇవ్వడం మానేసిందని హరిప్రకాష్ లేఖలో రాసుకొచ్చారు. 24 గంటలూ వాట్సప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని.. ఏమైనా ప్రశ్నిస్తే నీకెందుకు, నా లైఫ్ అనేదంటూ హరిప్రకాష్ వాపోయారు. తన స్నేహితుడు రాజేష్, భువనేశ్వరి మధ్య కూడా ఫోన్ కాల్స్, చాటింగ్ జరిగేదన్న హరిప్రకాష్.. స్నేహితుడని నమ్మితే మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరకు గత్యంతరం లేకనే ఈ నిర్ణయానికి వచ్చానంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
"అమ్మా, అన్నయ్యా, చెల్లి, నిక్కి, మను. మీరందరూ సంతోషంగా ఉండాలని, నేను ఎక్కడ ఉన్నా మీ మంచినే కోరుకుంటాను. నా చివరి కోరిక నా పాప భవిష్యత్తు నీదే చెల్లెమ్మ. నన్ను క్షమించు. మరో జన్మ ఉంటే నీకు కొడుకు, అన్న, తమ్ముడిగానో పుడతాను. నిక్కి, మను మీరు బాగా చదువుకోండి, మంచిగా బతకండి. అమ్మని, మామయ్యను, అమ్మమ్మను చక్కగా చూసుకోండి. నా పావను కంటికి రెప్పలా కాపాడుతారని మీ అందరికి అప్పగించి ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నా. నన్ను మన్నించండి. అమ్ము తల్లి ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ.. జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయకు, పాలు తాగు, బువ్వ తిను, ఎవరిని ఏవి అనకు, బాగా చదువుకో.. " అంటూ హరిప్రకాష్ రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై హరిప్రకాష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ద్వారకా జోన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం హరి ప్రకాష్ మృతదేహన్ని మార్చురీకి తరలించారు. హరిప్రకాష్ భార్య భువనేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న స్నేహితుడు రాజేష్ కోసం గాలిస్తున్నారు.