పల్నాడు జిల్లాలో దొంగలు రైళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ఆర్పీఎఫ్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శనివారం తెల్లవారుజామున చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు చైను లాగిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చైన్ లాగి.. రైళ్లోకి ప్రవేశించిన దొంగలు మహిళల మెడలోని చైన్ లాక్కుని పరారయ్యారు. దీంతో రైళ్లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజామున అందరూ మంచి నిద్రమత్తులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత బాధిత మహిళలకు స్టేషన్‌లోకి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు.
మరోవైపు నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లోకి చొరబడేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ నడికుడి నుంచి లింగంపల్లి వెళ్తున్న సమయంలో.. పల్నాడు జిల్లా మాచర్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి వద్ద కొంతమంది దుండగులు చైన్ లాగారు. అనంతరం బి-5, ఎస్-10, ఎస్-13 బోగీల్లో ఉన్న ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులు లాక్కుని పారిపోయేందుకు ప్లాన్ చేశారు. అయితే ఓ మహిళ గట్టిగా కేకలు వేయటంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అలాగే వెళ్తూ వెళ్తూ.. ఆర్ఫీఎఫ్ సిబ్బందిపైకి, ప్రయాణికుల పైకి రాళ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే ఈ ఘటనతో సుమారు అరగంట పాటు రైలు నిలిచిపోయింది.
అయితే రైళ్లల్లో చోరీలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు క్షేమంగా, సురక్షితంగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో రైళ్లో వస్తే ఇదేం సమస్యని ప్రశ్నిస్తున్నారు. తెల్లవారుజామున ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో దొంగలు చైన్ లాగి లోపలికి ప్రవేశిస్తున్నారని..ఈ భయంతో ప్రశాంతంగా నిద్రకూడా పోలేకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు బోగీల్లోకి ప్రవేశిస్తున్నారని.. ఇప్పుడు చోరీ ఘటనలు కూడా పెరుగుతుండటంపై ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించాలని.. తగిన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో వరుస చోరీలపైనా పోలీసులు దృష్టిసారించారు.