ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలం కైకరం నుంచి.. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కాన్వాయి వెళ్తున్న సమయంలో మంత్రి ఎస్కార్ట్ వాహనానికి ద్విచక్ర వాహనం అడ్డుగా వచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్‌గా బ్రేకు వేశాడు. దీంతో వెనుక హోం మంత్రి అనిత కూర్చున్న కారు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే హోం మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి అనిత వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బైక్ అకస్మాత్తుగా ఎదురు రావటంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడని.. దీంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో హోం మంత్రి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. మరో కారులో అనిత అలంపూరం బయల్దేరి వెళ్లినట్లు అధికారులు వివరించారు. మరోవైపు ఇటీవలే ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి కూడా ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలో పాలేటిపాడులో జరిగిన పోలేరమ్మ తిరునాళ్లకు మంత్రి హాజరయ్యారు. ఈ తిరునాళ్లల్లోనే ఆయనకు ప్రమాదం జరిగింది.
పోలేరమ్మ జాతరలో ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు మంత్రి బాల వీరాంజనేయస్వామితో ఫోటోలు దిగేందుకు స్థానిక టీడీపీ నేతలు పోటీపడ్డారు. దీంతో ఎద్దులు బెదిరిపోయాయి. తలతో ముందున్న మంత్రిని బలంగా నెట్టాయి. ఈ ఘటనలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బోర్లా పడిపోయారు. అయితే స్వల్పగాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ నేత ఇంట్లో మంత్రికి చికిత్స అందించారు. ఈ ఘటన జరిగిన నెలరోజుల గ్యాప్‌లోనే హోం మంత్రికి పెను ప్రమాదం తప్పింది.