తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరమని అన్నారు. 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో సమస్య తలెత్తిందని అన్నారు. 17వ గేటు నుంచి 32వ గేట్ల నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. నిపుణుల బృందం జలాశయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. కేంద్ర జల సంఘం కూడా నిపుణులను పంపిందని వివరించారు. జలాశయం నుంచి నీరు పెద్ద ఎత్తున బయటకు పోతోందని అన్నారు. జలాశయం దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ డ్యామ్ కర్నాటక - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచినట్లు తెలిపారు. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని.. రైతులు సహకరించాలని డిప్యూటీ సీఎం శివకుమార్ కోరారు.