తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. స్వాతంత్య్ర దినోత్సవ రద్దీ దృష్ట్యా కడప మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14, 16వ తేదీల్లో.. కాచిగూడ-తిరుపతిల మధ్య (07653) మధ్య నడిచే రైలు కాచిగూడలో రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి మీదుగా కడపకు మరుసటి రోజు ఉదయం 7.05కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయల్దేరి రేణిగుంట మీదుగా తిరుపతికి ఉదయం 10.25 గంటలకు వస్తుంది. ఈ నెల 15, 17 తేదీల్లో.. ఈ రైలు (07654) తిరుగు ప్రయాణంలో.. తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి కడపకు రాత్రి 10.23 గంటలకు చేరుకుంటంది. అక్కడి నుంచి బయల్దేరి.. కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటుంది.
ఈ నెల 14న తిరుపతి-నాగర్‌సోల్‌ల మధ్య మరో రైలు (07417) తిరుపతిలో ఉదయం 8.15 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా కడపకు 10.30కు వస్తుంది. ఆ తర్వాత ఎర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, ఔరంగాబాద్ మీదుగా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. ఈ రైలు (07418) తిరుగు ప్రయాణంలో ఈ నెల 15న రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.28 గంటలకు కడపకు, 10.30 గంటలకు తిరుపతికి వస్తుంది.
మరోవైపు కడప మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కొన్ని స్టేషన్లలో ఆగడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురం, నందలూరు, ఓబులవారిపల్లె, కొండాపురం, పుల్లంపేట స్టేషన్లలో రైళ్లు ఆపడం లేదు. గతంలో ఈ స్టేషన్‌లలో స్టాపింగ్‌లు ఉండేవి.. కరోనా సమయంలో రైల్వేశాఖ స్టాప్‌లు తొలగించగా.. ఆ తర్వాత గతంలో మాదిరిగా రైళ్లు నిలుపుతారని ప్రజలు భావించారు. గతంలోనే అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మళ్లీ ఆ స్టాప్‌లలో రైళ్లు ఆగేలా చూడాలంటున్నారు.
చిన్న స్టేషన్లల్లో రైళ్లు ఆపాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు వస్తున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలో వచ్చిన విజ్ఞప్తులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు స్టాపింగ్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో ఆ స్టాప్‌లను రద్దు చేశారని.. మరోసారి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని రైల్వే అధికారులు చెబుతున్నారు.