కళ్యాణ మండపంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు.. బంధువులు, స్నేహితలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో కొత్త జంట ఒక్కటి కాబోతోంది.. ఇంతలో ఊహించని పరిణామం కనిపించింది. ఓ యువతి కళ్యాణ మండపంలోకి దూసుకొచ్చింది.. నేరుగా వరుడి దగ్గరకు వెళ్లింది. ఆెమ దగ్గర మారణాయుధం చూసి అందరూ అవాక్కయ్యారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటపడింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని నందలూరులో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.
రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు.. తిరుపతికి చెందిన జయ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు పదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. బాషా కొద్దిరోజుల క్రితం సొంత ఊరికి వచ్చి ఓ యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఆదివారం పెళ్లికి ఏర్పాట్లు చేశారు.. ఈ విషయం తెలియడంతో జయ నేరుగా కళ్యాణ మండపానికి వచ్చింది.. అక్కడ ప్రియుడ్ని నిలదీసింది. ఆగ్రహంతో తనతో తెచ్చుకున్న కత్తి, యాసిడ్‌తో అతడిపై దాడికి ప్రయత్నించింది.
ఈ ఘటనలో కరీష్మా అనే మహిళపై యాసిడ్ పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసి ఆగ్రహంతో ఊగిపోయిన బాషా కత్తితో జయపై దాడి చేయడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇద్దరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని వధువు తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు వరుడి ప్రియురాలు మీడియాతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు ఓ గదిలో నిర్బంధించినట్లు తెలుస్తోంది. సయ్యద్ బాషా తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని జయ చెబుతోంది. బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతున్నాడని.. అనుమానం వచ్చి ఆరా తీస్తే పెళ్లి వ్యవహారం బయటపడిందన్నారు. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసినట్లు చెప్పింది. మొత్తానికి ప్రియురాలి ఎంట్రీతో నందులూరులో బాషా పెళ్లి ఆగిపోయింది.
ఈ ఘటనపై వరుడు బాషా స్పందించాడు. సదరు యువతితో తనకు గతంలో పరిచయం ఉందని.. ఇంతకు ముందుకూడా ఓ వ్యక్తిని ఇలానే యాసిడ్తో బెదిరించిందని చెప్పుకొచ్చాడు. ఆ విషయం తెలిసి తర్వాత తాను కూడా దూరంగా ఉన్నట్లు చెప్పాడు. కొంత కాలంగా తనతో విభేదించి ఆమెతో మాట్లాడటం లేదన్నాడు. ఇప్పుడు పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతో వచ్చి తన మీద దాడి చేసిందన్నాడు. తను తనకు 2015లో పరిచయమైందని.. వాళ్లకి తనుకు ఒకసారి గొడవ జరిగిందన్నాడు. అప్పటి నుంచి వాళ్లతో మాటలు కూడా లేవన్నాడు. తాను మండపంలోకి వెళ్లే సమయంలో యాసిడ్, కత్తి తీసుకొచ్చి తన మీద దాడి చేసిందని.. తనను కాపాడుకునే సమయంలో ఎదురుదాడి చేశానన్నారు బాష.