బీచ్‌రోడ్డులోని డైనోపార్కులో సంభవించిన అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందని కొందరు చెబుతుండగా మరికొందరు ఆస్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి కావాలనే నిప్పంటించారని ఆరోపిస్తున్నారు. దీనివెనుక జనసేనకు చెందిన ఓ నేత బంధువు సూత్రధారి అని అనుమానిస్తున్నారు. బీచ్‌రోడ్డులో మత్సదర్శినికి సమీపంలో ఆర్కేబీచ్‌వద్ద జీవీఎంసీకి చెందిన సుమారు 2,250 గజాల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో 419 గజాల స్థలాన్ని సిల్వర్‌స్పూన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకుంది. బీచ్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు జీవీఎంసీ రూపకల్పన చేయడంతో ఆ స్థలం లీజుని కొన్నాళ్ల కిందట జీవీఎంసీ రద్దుచేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిపై సంస్థ కోర్టును ఆశ్రయించింది. బీచ్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పనులు ప్రారంభించినపుడు తాము స్వచ్ఛందంగా స్థలాన్ని అప్పగిస్తామని, అప్పటివరకు మార్కెట్ ధర ప్రకారం లీజుకు ఇవ్వాలని కోర్టును కోరింది. దీనికి జీవీఎంసీ కూడా సమ్మతించడంతో కేసు ఉపసంహరించుకున్నారు. తర్వాత జీవీఎంసీ 419 గజాల స్థలాన్ని తిరిగి సిల్వర్‌స్పూన్ సంస్థకు లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఈ గడువు వచ్చే ఏడాది మే వరకూ ఉంది. ఇదిలా ఉండగా జీవీఎంసీ లీజుకు కేటాయించిన 419 గజాల స్థలం పోగా మిగిలిన 1,831 గజాల స్థలం కూడా అనధికారికంగా ఆక్రమించుకుని వ్యాపారం సాగిస్తున్నారని చాలా మంది జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గత ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడితో అధికారులు పట్టించుకోలేదు. తాజాగా జిల్లలోని జనసేన నేతకు చెందిన బంధువు ఆ స్థలంపై కన్నేశారు. సిల్వర్‌స్పూన్‌కు కేటాయించిన 419 గజాలు మినహాయించి, మిగిలిన స్థలాన్ని లీజు పేరుతో చేజిక్కించుకునేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల జీవీఎంసీ అధికారులను కూడా కలిసి, దీనిపై చర్చించినట్టు తెలిసింది. అయితే ఆస్థలంలో ఇప్పటికే కొన్ని దుకాణాలు, ఇతర ఆక్రమణలు ఉన్నందున వాటిని తొలగించాలంటే పైస్థాయి నుంచి ఆదేశాలు రావాలని, ఖాళీ స్థలమైతే లీజుకు ఇచ్చేస్తామని అధికారులు తేల్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఆక్వాస్పోర్ట్ కాంప్లెక్స్‌కు ముందువైపు బీచ్‌రోడ్డును ఆనుకుని ఉన్న ఐస్‌క్రీమ్ దుకాణం రిజర్వేషన్ కేటగిరీలో ఒక మహిళ వేలంలో దక్కించుకున్నారు. ఆ దుకాణాన్ని కూడా ఈ జనసేన నేత బంధువే చేజిక్కించుకున్నట్టు తెలిసింది. రిజర్వేషన్ కేటగిరీ కావడంతో ఆమె పేరుతో లీజు ఉన్నప్పటికీ, దుకాణం తన ఆధీనంలోనే ఉంచుకున్నట్టు సమాచారం. ఈ తరుణంలోనే సిల్వర్‌స్పూన్ రెస్టారెంట్‌ను ఆనుకుని ఉన్న డైనోపార్కులో సందర్శకులు లేని సమయంలోనే అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ స్థలాన్ని చేజికి ్కంచుకునేందుకు జనసేన నేత బంధువే ప్రమాదం సృష్టించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని త్రీటౌన్ సీఐ వద్ద ప్రస్తావించగా, దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయన్నారు.