నెల్లూరులో చదువుకునే రోజుల్లో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలు చేపడతారని తెలిసి అక్కడికి వెళ్లాలనుకున్నా.అయితే శాస్త్రవేత్తలుంటారు కాబట్టి భారీ భద్రతా ఏర్పాట్లుంటాయి కాబట్టి వెళ్లలేమలే అనుకునే వాడిని.అయితే ఈ రోజు యాధృచ్ఛికంగా అంతరిక్ష దినోత్సవానికి హాజరై షార్ సందర్శించడడమనే కల నెరవేరింది....అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.ఎవరైనా మంచిని బలంగా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందనేది తన విషయంలో నిజమైందన్నారు. షార్‌లో మంగళవారం జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని కురుప్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి అంతరిక్ష దినోత్సవాలను ప్రారంభించారు.అనంతరం షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు 40 వేల ఎకరాల చిట్టడవిలో ఉన్న శ్రీహరికోట నేడు దేశానికే తలామానికంగా మారిందంటే అది శాస్త్రవేత్తల ఘనతేనని తెలిపారు.అంతరిక్షంలోకి మనిషిని పంపడం మన ముందున్న సవాల్ అని అది కూడా శ్రీహరికోట నుంచి పంపించేందుకు సన్నాహాలు చేయడం శుభపరిణామమన్నారు. ఇస్రో పరిశోధనలకు, కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. ఏపీ యువతలో అపరిమితమైన జిజ్ఞాస వుందని, దాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళే దారి లేక యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తోందన్నారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరముందన్నారు. షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనల ఫలాలు సామాన్యులకు సైతం అందినప్పుడే నిజమైన విజయమన్నారు. అందులో భాగంగానే అంతరిక్ష పరిశోధనల గురించి గ్రామీణ యువతకు సైతం తెలియజేసేందుకు ఇస్రో ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్ల కలను చంద్రయాన్-3 విజయంతో నెరవేర్చుకొన్నామని, ఇది దేశానికి కానుకగా ఇస్రో ఇచ్చిన భారీ విజయమన్నారు. 2023వ సంవత్సరం ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన రోజును భారత ప్రభుత్వం అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా సంబరాలు చేసి మారుమూల గ్రామాలకు సైతం అంతరిక్ష పరిశోధనలు తీసుకెళ్లడం మంచిదన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భావి తరాలకు ఎంతో ఉపయోగమన్నారు.అంతరిక్ష దినోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.పవన్‌కు అధికారులు చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహుకరించారు.అంతకుముందు పవన్ కల్యాణ్‌కు హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ వెంకటేశ్వర్,ఎస్పీ సుబ్బరాయుడు, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ స్వాగతం పలికారు.కురుఫ్ ఆడిటోరియంలో ఆయనకు షార్ డైరెక్టర్ చంద్రయాన్-3 రాకెట్ నమూనాను, ఉపగ్రహాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, షార్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసుల రెడ్డి,అసోసియేట్ డైరెక్టర్ సయ్యద్ అహ్మద్, డిప్యూటీ డైరెక్టర్ టీఎస్ రఘురామ్, గ్రూపు డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.