మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల భూ సమస్యలు పరిష్కరిం చాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాలూరులోని తన నివాసంలో ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. అనంతరం ఆమె మెంటాడ, పాచిపెంట మండలాల తహసీల్దారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో ప్రజల భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పాచిపెంట మండలంలో కూడుమూరు భూ సమస్య కు సంబంధించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందరికీ న్యాయం జరిగేలా అధికారులు చూడాలన్నారు. మెంటాడ మండలంలో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగేలా రెవెన్యూ అధికారులు పని చేయాలని ఆదేశించారు. తన ఇల్లు కొద్దిపాటి వర్షానికే కారిపోతోం దని... తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పాచిపెంట మండలం గుంటమామిడి వలస గ్రామానికి చెందిన సంగిరెడ్డి గంగమ్మ వినతిపత్రం అందజేశారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.