జనాభా నియంత్రణ కోసం తీసుకొచ్చిన నిబంధనలు అసరుకే ఎసరు తేవడంతో చైనా నష్టనివారణకు నడుం బిగించింది. దేశంలో జననాల రేటు ఆందోళనకరంగా పడిపోవడంతో డ్రాగన్ అప్రమత్తమయ్యింది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా వృద్ధిరేటు తగ్గుదలతో ఆందోళన చెందుతున్న చైనా.. వివాహవ్యవస్థను బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు వివాహాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసి ఓ ముసాయిదాను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీనిపై ప్రజాభిప్రాయసేకరణ చేపట్టి చట్టాన్ని తీసుకురానుంది.
ఇప్పటి వరకూ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లకు ఉన్న ప్రాంతీయ నిబంధనలను తొలగించింది. హౌస్‌హోల్డ్ రిజిస్టర్ అవసరం లేదని స్పష్టం చేసింది. కుటుంబ వ్యవస్థకు అనుకూల సమాజం నిర్మాణానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో విడాకులను తగ్గించేందుకు వీలుగా ముసాయిదాలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. విడాకులకు 30 రోజుల కూలింగ్ పీరియడ్ ప్రతిపాదించి... ఆ లోపు జంటలో ఏ ఒక్కరు విడాకులకు సమ్మతించకపోయినా దరఖాస్తును వెనక్కి తీసుకోవచ్చు. దీంతో విడాకుల ప్రక్రియను నిలిచిపోతుంది.
ఈ ముసాయిదాపై సెప్టెంబరులోగా ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని జిన్‌పింగ్ సర్కారు కోరింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చైనావ్యాప్తంగా 34.3 లక్షల వివాహాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 5 లక్షలు తక్కువ. 2013 తర్వాత అక్కడ ఇంత తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి వివాహాల సంఖ్యను పెంపుదలకు ప్రభుత్వం గతేడాది నుంచే చైనా పలు చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాలు జననాల రేటు పెంచేందుకు పన్ను రాయితీలు, ఇళ్లపై సబ్సిడీలు, మూడోబిడ్డను కంటే రాయితీ విద్య వంటి సౌకర్యాలను కల్పించాయి. 25 ఏళ్లలోపు వయసున్న యువతులు వివాహం చేసుకొనేలా కూడా ప్రోత్సాహకాలను ప్రకటించారు.
కాగా, ఈ ముసాయిదా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పెళ్లి చాలా సులభం.. విడాకుల కష్టం.. ఇదో పనికిమాలిన నిబంధన’ అని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు వేలాది లైక్‌లు వస్తున్నాయి. అయితే, ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం పెళ్లి, కుటుంబం ప్రాముఖ్యతను చెప్పడానికే ఈ నిబంధనలు తీసుకొచ్చారని జయాన్ జనటంగ్ యూనివర్సిటీ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ జియాగ్ క్యెన్‌బో అన్నారు.