ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాది దేశంలో మంకీ పాక్స్(Monkey pox) వైరస్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ నిర్దారణ అయినట్టు పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం సౌదీ అరేబియా నుంచి ఆగస్టు 3న వచ్చిన ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ వైరస్ ధ్రువీకరణ అయ్యింది. పాక్‌కు వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురైన బాధితులు వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది.
దేశంలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదైనట్టు పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్శిటీ ఆగస్టు 13న వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ పేర్కొంది. వైరస్ నిర్దారణ అయిన ముగ్గురు పాకిస్థాన్ పౌరులేనని, వారి వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పాకిస్థాన్ హెల్త్ డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. ప్రస్తుతం ఇన్‌ఫక్టియస్ డిసీజ్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించింది. పాక్‌లో ఈ ఏడాది నమోదయిన మొదటి మంకీపాక్స్ కేసులు ఇవే.
కాగా, 2023 తొలినాళ్లలో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ నిర్ధరణ కావడంతో పాక్ అధికారులు అప్రమత్తమయ్యారు. వారికి అత్యవసర చికిత్స అందజేసి.. అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది 11 కేసులు నమోదుకాగా.. ఒకరు మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఇక, ప్రపంచవ్యాప్తంగా 122 దేశాల్లో 99,518 మంకీ పాక్స్ కేసులు, 208 మరణాలు నమోదయినట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి నేషనల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ హెల్త్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం ఇది ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండడంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
సన్నితంగా మెలిగేవారికి వ్యాపించే ఈ వైరస్ లక్షణాలు.. కరోనా మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు వంటివి ప్రధానంగా ఉంటాయి. కళ్లు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. తొలుత నీటి బొడిపెల్లా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. వ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను తాకడం, ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా వ్యాపిస్తుంది.