ఓ జంట పెళ్లి చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇంతలో పోలీసులు సడన్ ఎంట్రీ ఇచ్చారు.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అప్పుడు అసలు సంగతి తెలిసింది. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య ప్రేమించుకుంటున్నారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో అలేఖ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొత్త జంట తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన భవానీపురం పోలీసులు తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించారు.
కొత్త జంట వాహనంలో తిరుచానూరు సమీపంలో వస్తుండగా పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అలేఖ్య మాత్రం తాము ఇద్దరం 11 ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు మేజర్లమని.. ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని.. పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రేమ జంటను భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.
అలేఖ్య, శివలు 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో గురువారం వివాహం చేసుకున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కారులో వస్తుండగా.. తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు ఇష్ట్రపకారమే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఈ పెళ్లి అలేఖ్య తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నట్లు శివ అంటున్నారు. అలేఖ్య కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. తమను పోలీసులే రక్షించాలని శివ కోరుతున్నారు.
స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మణికంఠ స్వామి తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది రకాల 20 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 1, పుష్కరిణి వద్ద 1, వాహన మండపం వద్ద 1, ఫ్రైడే గార్డెన్స్ 1, తొలప్ప గార్డెన్ 1 కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa