తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు, మూడవ ఎలిమెంట్‌లు ఇంజనీర్లు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు. చరిత్రలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది మొదటిసారన్నారు. ఈరోజు (శనివారం) మిగిలిన నాలుగు బిట్‌ల అమరిక పూర్తయితే 70 టీఎంసీల నీటిని సముద్రంపాలు కాకుండా కాపాడుకోగలుగుతామన్నారు. తుంగభద్ర గేటు మరమ్మతులను విజయవంతంగా పూర్తి చేసే నిపుణుల రిస్క్ టీంకు సారధ్యం వహించేలా అత్యంత నిపుణత కలిగిన కన్నమ నాయుడుకు బాధ్యతలు అప్పగించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుకు నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. మూడు రోజుల క్రితమే తుంగభద్ర జలాశయంలో తుంగభద్ర జలాశయంలో గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. తుంగభద్ర 19వ నెంబర్ గేట్ వద్ద డ్యామ్ వద్ద అధికారులు పూజలు చేసి పనులను మొదలుపెట్టారు. కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో జలాశయ అధికారులు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటును అమర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.