సాధారణ ప్రసవాలు ఆసుపత్రిలోనే జరగాలని, ఇక్కడి నుంచి రిపర్ చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. గజపతినగరం ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యులు ప్రసవాలను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ముగ్గురు గైన్‌కాలిస్ట్‌లు ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇందుకు వైద్యులు.. ప్రసవాలు ఇక్కడే జరుగుతున్నాయని చెప్పడంతో సమాచారం తెప్పించుకుంటానని మంత్రి తెలిపారు. ముఖ్యంగా మార్చురీ గది లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అలాగే డ్రైనేజీ, జనరేటర్, సమస్యలు ఉన్నాయని సూపరెండెంట్ జగదీష్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వంద పడకల ఆసుపత్రికి సంబంధించి పనులు నిలిచిపోవడంతో 30 పడకల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రూ.కోటి 20లక్షలతో ప్రతిపాదనలు చేశామని, త్వరలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నిరుపేదలకు ఇబ్బందులకు కలగకుండా కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకు ఎవరు నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, ప్రదీప్‌కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.