వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు నిరసనగా శనివారం జిల్లాలోని 223 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జేసీ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రాణాలు రక్షించే వారికే నేడు సమాజంలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ పిలుపు మేరకు రాష్ట్రం, జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఆసుపత్రులకు రావద్దని ప్రజలకు సూచించారు.