ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్. సెప్టెంబర్ నెలలో కూడా రేషన్‌లో సరుకులు పంపిణీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల రేషన్ సరుకుల్లో కూడా కందిపప్పు, పంచదార పంపిణీ చేయడం సాధ్యమయ్యేలా లేదు. సెప్టెంబరు కోటాలో కూడా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తారంటున్నారు. ఆగస్టు నుంచే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా.. రేషన్ కార్డులు ఉన్నవారికి ఉచిత బియ్యంతో పాటుగా రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం 2 నెలలుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై కందిపప్పు, పంచదారను పంపిణీ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 దాటిపోగా.. పంచదార కిలో దాదాపు రూ.50కు దగ్గరగా వచ్చింది. దీంతో ప్రభుత్వం రేషన్ ద్వారా కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కి, పంచదార రూ.17కే అందించాలని భావించారు. దీని కోసం ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబరు వరకు.. మూడు నెలలకు సరిపోయేలా కందిపప్పు, చక్కెర కోసం పౌరసరఫరాల సంస్థ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా గత జూలై నెలలో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 22,500 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 17,538 మెట్రిక్ టన్నుల పంచదార సేకరించాలని భావించారు.
రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల్లో రేషన్ కార్డుదారులు, ఐసీడీఎస్ లబ్ధిదారులకు ప్యాకెట్లలో సరఫరా చేసే కందిపప్పు విలువ సుమారు రూ.394 కోట్లు. కందిపప్పుకు సంబంధించిన టెండరు విలువ రూ.100 కోట్లు దాటితే చట్ట ప్రకారం న్యాయ సమీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పౌరసరఫరాల శాఖ ఈ టెండరు వివరాలను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపించగా.. దీనిపై న్యాయమూర్తి వివరణ కోరారు. అయితే కార్పొరేషన్ నుంచి న్యాయమూర్తికి సమాధానాలు పంపించడానికి నెల రోజులు గడిచింది. దీంతో ఆగస్టులో కందిపప్పు సరఫరా నిలిచిపోగా.. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఇక మిగిలిన పంచదార టెండర్లను జోన్ల వారీగా ఆహ్వానించడంతో జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లక్కర్లేదు. కానీ చక్కెర సరఫరాదారులు ఈ టెండరులో ఎక్కువ ధరలు కోట్ చేశారనే కారణంతో అధికారులు ఆ టెండరును రద్దు చేశారు. మళ్లీ గత నెలలోనే రెండోసారి టెండర్లు ఆహ్వానించగా.. ఈ టెండరులో జోన్ల వారీగా మొత్తం ఆరుగురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మిగిలిన జోన్లకు సంబంధించిన టెండర్లు ఖరారైనా.. మొదటి జోన్ (ఐదు జిల్లాలు) టెండర్ల ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు. ఈ కారణంగా గత రెండు నెలలుగా రాష్ట్రం మొత్తంగా పంచదార పంపిణీని కూడా సాధ్యం కాలేదు.