మనం ఎన్నో రకాల పాఠశాలలను చూసి ఉంటాం. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలు, సంగీత పాఠశాలలు, వేద పాఠశాలలు, మానసిక దృఢత్వ పాఠశాలలు ఇలా రకరకాలుగా ఎన్నో పాఠశాలలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం దొంగల పాఠశాల ఉంది. అదేంటీ దొంగల పాఠశాలనా అని ఆశ్చర్యపోతున్నారా. అవునండీ ఇది నిజం. దొంగలుగా తీర్చిదిద్దేందుకు కూడా పాఠశాల ఉంది. దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో ఈ పాఠశాలలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఈ పాఠశాలలో ఇలాంటి చోరకళలు నేర్పిస్తూ ఉంటారు. ఇందుకోసం భారీగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. ఈ దొంగల పాఠశాల మధ్యప్రదేశ్‌లో ఉంది.
మధ్యప్రదేశ్‌లోని 3 మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలకు దొంగతనం, దోపిడీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. రాజ్‌గఢ్ జిల్లాలోని 3 గ్రామాల్లో ఈ దొంగతనాలు నేర్పించడం కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో పిల్లలను చేర్చుకునేందుకు అక్షరాలా రూ.2 నుంచి రూ. 3 లక్షల వరకు ఫీజు కూడా కట్టించుకుంటున్నారు. రాజ్‌గఢ్ జిల్లాలోని ఖడియా, గుల్ఖేడీ, హుల్ఖేడీ గ్రామాల్లో.. ఉన్న ఈ స్కూళ్లలో స్పెషల్‌గా దొంగతనాలు, దోపీడీలు వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. 12 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలను తల్లిదండ్రులే స్వయంగా ఈ పాఠశాలలకు పంపిస్తూ ఉన్నారు.
ఈ పాఠశాలలో చేరేందుకు దాదాపు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు చెల్లిస్తూ ఉంటారు. ఈ స్కూళ్లలో దొంగతనం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఎలా బ్యాగులు కొట్టేయాలి.. వేగంగా పరిగెత్తడం.. పోలీసుల నుంచి తప్పించుకోవడం వంటివి నేర్పిస్తూ ఉంటారు. ఇక పొరపాటున పోలీసులకు దొరికితే వారు కొట్టే దెబ్బలను కూడా తట్టుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. ఇక ఏడాది ట్రైనింగ్ ముగిసిన తర్వాత.. ఆ పిల్లల తల్లిదండ్రులకు ఆ స్కూల్‌లోని ముఠా నాయకుడి నుంచి ఏడాదికి రూ. 3 లక్షల రూ.5 లక్షల వరకు జీతం అందిస్తూ ఉంటారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు దొంగతనాలు, దోపిడీల్లో పూర్తిగా ఆరితేరి ఉంటారు. వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉండడం గమనార్హం.
గత ఏడాది ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో జరిగిన దొంగతనాన్ని ఈ గ్రామాలకు చెందిన వ్యక్తే చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక జైపూర్‌లోని హోటల్లో హైదరాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త కుమారుడి పెళ్లలోనూ రూ.1.5 కోట్ల విలువైన బంగారం, రూ. 1 లక్ష బ్యాగుని దొంగలించిన ఓ బాలుడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్ జిల్లాలోని పలు గ్రామాలు నేరాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాయని గుర్తించారు. దొంగిలించిన నగల విలువను కచ్చితంగా అంచనా వేయగల నైపుణ్యం వారికి ఉంటుందని తెలిపారు.
ఈ గ్రామాల్లో ఎవరైనా కొత్తగా వచ్చినా.. వారి వద్ద కెమెరాలు.. సెల్‌ఫోన్లు ఉన్నట్లు గ్రామస్థులు గమనిస్తే వారు వెంటనే అలర్ట్ అవుతారని పోలీసులు తెలిపారు. ఇక్కడ సాధారణంగా తక్కువ చదువుకున్న, పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలే ఉంటారని పేర్కొన్నారు. దాదాపు 300 మందికి పైగా పిల్లలు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పెళ్లిళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 8 వేల కేసులు ఉండగా.. అందులో ఈ గ్రామాలకు చెందిన 2 వేల మందిపై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.