ఏపీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు గాను పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ల ఆధునికీకరణ, సౌకర్యాల మెరుగు తదితర అంశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుసానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.బుధవారం హోంశాఖపై చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మంత్రి అనితతో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను హోంమంత్రి మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో ప్రతి పోలీసు స్టేషన్‌కు ఆరు సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం 15 వేల సీసీ కెమెరాలుండగా వీటిలో మరమ్మతుకు గురైనవి ఉన్నాయని తెలిపారు.సీసీ కెమెరాలు, ఇతర ఫింగర్‌ప్రింట్స్, తదితర యంత్రాల నిర్వహణకుగాను పెండింగ్‌లో ఉన్న రూ.11 కోట్లను విడుదలకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు శాఖలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అనుమతించారని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళల భద్రత గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.