అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఉన్న అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుతో.. భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పంపించి.. మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు.. రియాక్టర్ పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వివరాలు తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
మరోవైపు.. ఆ ఎసెన్షియా కంపెనీలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇక రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో.. దాని శబ్దానికి ఆ గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక భారీగా ఎగిసిపడుతున్న మంటల ధాటికి.. ఆ గ్రామం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి.. ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు.. ఈ అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలిన ఘటనపై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సహాయం, చికిత్స అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.