వారధి కార్యక్రమం పేరుతో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం బీజేపీ చేపట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి.. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులను మంత్రికి వివరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారని అన్నారు. వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతున్నామని అన్నారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి.. పాలో అప్ చేస్తున్నామని అన్నారు. యాక్షన్ పాన్ పెట్టుకుని.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఎక్కువుగా భూసమస్యలు, ఆరోగ్యానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మూడు కేటగిరీలుగా సమస్యలను గుర్తించి.. తక్షణం చేయాల్సినవి ముందు పూర్తి చేస్తున్నామని అన్నారు. ఆర్థిక వనరులను కూడా దృష్టిలో ఉంచుకుని వసతులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెడికల్ పరికరాలు, ఇతర సదుపాయాలపై ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. త్వరితగతిన ప్రభుత్వ ఆస్పత్రుల రూపరేఖలు మార్చి ప్రజల్లో నమ్మకం పెంచేలా చేస్తామని అన్నారు. త్వరలోనే సర్కారు దవాఖానాల్లో ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందేలా చేస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.