ఆంధ్రప్రదేశ్‌లో అనధికార లే అవుట్లపై మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేని లే అవుట్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. పురపాలక, నగర పాలక సంస్థల పరిధిలో అనధికారిక లే అవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాల్టీల్లోని లే అవుట్లలో 50 శాతం మేర అనధవికారిక లే అవుట్లు ఉన్నాయని మున్సిపల్ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీంతో అనధికారిక లే అవుట్ల ముందు బోర్డులు పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇప్పటికే వివిధ మున్సిపాల్టీల పరిధిలో అనుమతులు లేని లే అవుట్ల సమాచారాన్ని ప్రకటనల రూపంలో మున్సిపల్ శాఖ వెల్లడిస్తోంది. అనధికారిక లే అవుట్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపాల్టీల్లోని అనధికారిక లే అవుట్లతో పాటు వివిధ అర్బన్ అథారిటీల పరిధిలో వేసిన అనధికారిక లే అవుట్ల మీద మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టిందన్నారు. అర్బన్ అథారిటీల పరిధిలో 50 శాతానికి మించి అనధికారిక లే అవుట్లు ఉంటాయని మున్సిపల్ శాఖ ఇప్పటికే అంచనా వేసింది.