అచ్యుతాపురం ఎస్ఈజెడ్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా ఎస్పీ ఎం దీపిక పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందించామని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు చొప్పున అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాం, అదేవిధంగా భద్రత కూడా ముఖ్యమేనని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కంపెనీలో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో భారీ విస్ఫోటం జరిగింది. ఇక్కడ ఈ విధ్వంసానికి కారణమైంది.. మిథైల్ టెరిషరీ బ్యుటైల్ ఈథర్! ఈ ద్రవరూప రసాయనం లీకై ఎలక్ట్రిక్ కేబుళ్లపై పడటం.. ఆ వేడికి ఆవిరి మేఘాలుగా మారడం.. చిన్న ‘స్పార్క్’ కారణంగా భారీ విస్ఫోటం జరగడం చకచకా జరిగిపోయాయి. 17 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలలేదని.. ఆవిరి మేఘాల విస్ఫోటమే (వేపర్ క్లౌడ్ ఎక్స్‌ప్లోజన్) ఈ ఘోరానికి కారణమని తేలింది. వాస్తవానికి ఎసెన్షియా సంస్థలో పనిచేసే వారిలో అనుభవజ్ఞులు కానీ.. నిపుణులైన సిబ్బంది కానీ ఎవరూ లేరని తెలుస్తోంది. రెండో అంతస్థులోని రియాక్టర్ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు పంప్ చేస్తున్న సాల్వెంట్ లీకేజీని సిబ్బంది గమనించారు కానీ వారికి దాని తీవ్రత ఎలా ఉంటుందనేది కానీ పరిణామాలు కానీ తెలియలేదట. అయినప్పటికీ లీకేజీని ఆపడానికి సిబ్బంది శతవిధాలుగా ప్రయత్నించారు. లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించిన వెంటనే పైకి వెళ్లి సాల్వెంట్ పైపులైన్ వాల్వ్‌ను కట్టేశారు. కానీ అప్పటికే రసాయన చర్య ప్రారంభమవడం.. వేడిగా ఉన్న విద్యుత్ ప్యానెల్ బోర్డుపై.. త్వరగా ఆవిరయ్యే స్వభావమున్న మిథైల్ టెరిషరీ బ్యుటైల్ ద్రావకం పడటంతో వెంటనే ఆవిరి మేఘాలు ఏర్పడటం చకచకా జరిగిపోయాయి. ఆ ఆవిరి బయటికి పోయే వీల్లేకపోవడంతో... కేబుల్ డక్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వ్యాపించింది. అంతలోనే స్పార్క్ వచ్చి పెద్ద పేలుడు సంభవించింది. ఆ ధాటికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని సిమెంట్ స్తంభాలు విరిగిపోయి.. గోడలన్నీ కూలిపోయాయి. వాటి కింద పడి కొందరు... వ్యాపించిన మంటల్లో పడి మరికొందరు మరణించారు. సిబ్బందిలో కొందరు ఫైర్ హైడ్రంట్ లైన్‌తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ.. పంపింగ్ చేసినా కానీ ఫలితం దక్కలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa