గోద్రెజ్ ఇండస్ట్రీస్ సీఎండీ నాదిర్ గోద్రెజ్, బృందం గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘రాష్ట్రంలో కీలకమైన రంగాల్లో పెట్టుబడి పెట్టే విషయమై చర్చించాం. నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్ (ఎన్‌ఎంఈఓ-ఓపీ), ఆయిల్ పామ్ సాగు, రొయ్యల మేతకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపునకు ఉన్న అవకాశాలను చర్చించాం. అమరావతి, విశాఖపట్నంలో కీలక పెట్టుబడులతోపాటు పురుగు మందుల తయారీ రంగంలో దఫాలవారీగా రూ.2,800 కోట్లు పెట్టుబడి పెట్టే విషయంపైనా చర్చించాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఉద్దీపింప చేయడానికి అగ్రి, ఆక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న అవకాశాలనూ పరిశీలించాం’ అని చంద్రబాబు తెలిపారు.