గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై ప్రభుత్వం మొట్టమొదట దృష్టి సారించింది. గ్రామాల్లో స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్థుల సమష్ఠి నిర్ణయం ఉండాలి. దానికి మూలం గ్రామ సభలు. అవి మొక్కుబడిగా కాకుండా వాస్తవంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే ప్రజల మనోభావాలను పంచుకునే అవకాశముంటుంది. కేంద్రం కూడా గ్రామ సభలను బలోపేతం చేసేందుకు నిర్ణయ్ అనే పోర్టల్‌ను ఏర్పాటుచేసింది. ప్రజల భాగస్వామ్యం కల్పించడం, పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా గ్రామ సభలు నిర్వహించేందుకు పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖను అధ్యయనం చేశారు. కేరళలో గ్రామ పంచాయతీలు బలోపేతమవ్వడం వెనుక మూలాలను పరిశీలించారు. అక్కడ పనిచేసి వచ్చిన పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ అనుభవ సహకారంతో వ్యవస్థను బలోపేతం చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దానిని చేపట్టాలని నిర్ణయించారు. తద్వారా గ్రామ సభల ప్రాధాన్యాన్ని స్పష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో నాలుగు రకాల సౌకర్యాలు సమకూర్చాలన్నారు. కుటుంబాలకు కనీస అవసరాలైన విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, ఎల్‌పీజీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గ్రామాలకు ఉమ్మడి సౌకర్యాలైన తాగునీటి సరఫరా పథకం, డ్రైనేజీ, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వీధిలైట్లు, సీసీ రోడ్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, అన్ని గ్రామాలకు, గ్రామాల నుంచి మార్కెట్లకు, సమీప నగరాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. గ్రామ పంచాయతీ రోడ్లు, అంతర్గత రోడ్డు, లింక్‌రోడ్లు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో మౌలిక వసతులైన కందకాలు, ఫారంపాండ్స్ ఏర్పాటు చేయాలి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఉద్యానవనం, సెరికల్చర్‌కు అవసరమైన మౌలిక వసతులు, పశువుల కొట్టాలు, పశువులకు సంబంధించిన వసతులు ఏర్పాటు చేయాలి. వీటన్నింటినీ సాధించడం ద్వారా స్వర్ణ గ్రామ పంచాయతీలను సాధించుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ శుక్రవారం నిర్వహించే గ్రామ సభల్లో చేర్చాలని సూచించారు