దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 26) ప్రకటించింది.వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే మూడు రాజ్యసభ స్ధానాలు ఉన్నాయి. వైసీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్యలు ఇటీవల తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మూడు కాకుండా ఒడిశా, బెంగాల్, హర్యానాలలో కూడా ఖాళీగా ఉన్న ఒక్కో రాజ్యసభ స్థానాలకూ కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 3న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది డిసెంబర్ 10 కాగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు తుది గ డువు డిసెంబర్ 13. పోలింగ్ డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది.