విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితమే డిజైన్ తయారైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ 2021 ధరల ప్రకారం 12 అంతస్థుల భవన నిర్మాణానికి రూ.154.82 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అనేక తర్జనభర్జనల అనంతరం జోనల్ కార్యాలయ భవన నిర్మాణాలకు రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది. ముడసర్లోవలో జీవీఎంసీ అప్పగించిన భూముల్లోనే జోనల్ కార్యాలయం నిర్మితం కానుంది. రైల్వే జోన్ కార్యాలయాన్ని కార్పొరేట్ తరహాలో నిర్మించినా పర్యావరణానికి, పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 38.4 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంలో 12 అంతస్థులు ఉంటాయి. అందులో రెండు బేస్మెంట్లు, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్. రెండు బేస్మెంట్లను పూర్తిగా పార్కింగ్‌కు కేటాయించారు. భవనం చుట్టూ ఉండే ఓపెన్ ఏరియాలో కూడా వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే 290 కార్లు, 615 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు.