విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో శనివారం సాయంత్రం అరుదైన సన్నివేశం కనిపించింది. సముద్రం దాదాపుగా 400 మీటర్లు దూరం వెనక్కి వెళ్లింది. సాధారణంగా ఆర్కే బీచ్ వద్ద అలలు ఎగసిపడుతూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంటాయి. అలా ఉప్పొంగి వచ్చే అలలను ఆస్వాదిస్తూ.. సందర్శకులు సేదదీరుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అలలు ఉద్ధృతికి సముద్రం తీరం దగ్గరకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ శనివారం సాయంత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఏర్పడింది. సముద్రం 400 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రం లోపల ఉండే శిలలు బయటపడ్డాయి. దీంతో బీచ్ చూడ్డానికి వచ్చిన పర్యాటకులు.. వాటిపై నిలబడి సెల్ఫీలు దిగారు. అయితే విశాఖపట్నంలో సముద్రం ఇలా వెనక్కి వెళ్లడం ఇదేమీ కొత్త కాదు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా సముద్రం వెనక్కి వెళ్లింది.
మరోవైపు సముద్రం ఇలా వెనక్కి వెళ్లడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అలలు కూడా ఇందుకు కారణంగా చెప్తున్నారు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆటుపోట్లు ఏర్పడుతాయని వివరిస్తున్నారు. ఆటుపోట్ల సమయంలో సముద్ర జలాల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుందని చెప్తున్నారు. ఇక సూర్యుడితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణశక్తి అధికంగా ఉంటుందని.. భూమికి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. అందుకే ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడని వివరిస్తున్నారు. మరోవైపు కొన్నిసార్లు సముద్రం లోపల జరిగే అనేక పరిణామాలు వలన కూడా తీరాలపై ప్రభావం పడుతుందంటున్నారు.
మరోవైపు సముద్రం ఉపరితలంపై నీటికణం పైకి చేరినప్పుడు కాస్త నెమ్మదిస్తుంది.. ఇదే సమయంలో గురుత్వాకర్షణ శక్తి దానిని వెనక్కి లాగుతుంది. దీంతో పైకి వచ్చి నీటి కణం తిరిగి దాని అసలు స్థానానికి చేరుకుంటుంది. ఈ కారణంగానే సముద్రపు నీరు ఒడ్డుకు వచ్చి.. ఆ తర్వాత వెనక్కి నెట్టబడుతుందని మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఫలితంగానే సముద్రం ఇలా వెనక్కి వెళ్లే ఘటనలు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అయితే సముద్రం ఇలా వెనక్కి వెళ్లిన సమయంలో సముద్రపు కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.