ఏపీవాసులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌ను వరుణుడు మరోసారి పలకరించనున్నాడు. వచ్చే రెండురోజులు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇక అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
మరోవైపు ఆదివారం తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైయస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరోవైపు గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల కిందట శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో శ్రీశైలంలో మళ్లీ నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండితే మరోసారి గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయి. అటు మరో ఐదురోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.