నేటి నుంచి విశాఖలో అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది. అగ్ని వీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ బీచ్ రోడ్‌లో ఇవాళ్టి నుంచి భారీ ఆర్మీ ర్యాలీని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. నేటి నుంచి సెప్టెంబర్ ఐదు వరకు అగ్ని వీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగనుంది. ప్రతి రోజు 800 నుంచి 1000 మంది అభ్యర్థుల వరకూ ర్యాలీలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 1600 మీటర్ల మేర ర్యాలీ జరుగనుంది. పోర్ట్ డైమండ్ జూబ్లీలో జరగాల్సిన అగ్ని వీర్ సెలక్షన్స్ ప్రస్తుతం ఆర్కే బీచ్‌లో జరుగుతున్నాయి. నిన్న రాత్రి వర్షం పడడంతో ర్యాలీని అధికారులు బీచ్ రోడ్డుకు మార్చారు. బీచ్ రోడ్‌లో ర్యాలీలో పరిగెడుతుండగా ఒక అభ్యర్థి కిందపడటంతో కాలి మోకాలికి గాయమైంది. 108 సహాయంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.విశాఖ పట్టణంలోని పోర్ట్ స్టేడియంలో సెప్టెంబర్ 5 వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ నేపథ్యంలో విశాఖ మొత్తం సందడిగా మారింది. అగ్నివీర్ సెలక్షన్స్ కోసం పోర్ట్ డైమండ్ జూబ్లీని ముందుగానే అధికారులు సిద్ధం చేశారు. అయితే ఆదివారం రాత్రి విశాఖ పట్టణంలో భారీ వర్షం కురవడంతో రిక్రూట్మెంట్ జరిగే పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ప్రాంతమంతా బురద మయంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ అధికారులు.. పోర్ట్ స్టేడియం నుంచి ఆర్కే బీచ్‌కు వేదికను మార్చారు. దీనికోసం వెంటనే ఆర్టీసీని సైతం సంప్రదించారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వాటి ద్వారా అభ్యర్థులను ఆర్కే బీచ్‌కు తరలించి అక్కడ సెలక్షన్స్ చేపట్టారు.