ఒంగోలులో శిశువు విక్రయం తీవ్ర కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్‌లో పది వేలకు కన్న కూతురుని విక్రయించిన అంగన్వాడీ కార్యకర్త మంజుల. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన బాలసుందరరావుకి మధ్యవర్తుల ద్వారా చిన్నారిని విక్రయించింది. పాపని అమ్మిన తర్వాత అంగన్వాడీ కార్యకర్త రిమ్స్‌లో కనిపించకుండా పోయింది. అంగన్వాడీ కార్యకర్త మంజుల రక్త హీనతతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన రిమ్స్ వైద్యులు...శిశువు విక్రయంపై బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాపను క్షేమంగా తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో రోగులు అన్నమోరామచంద్ర అని వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే రోగులు అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆహారం కూడా అందించకుండా కాంట్రాక్టర్ కడుపు కాలుస్తున్న పరిస్థితి. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 33 మంది రోగులకు గత రాత్రి నుంచి డైట్ అందలేదు. ఆహారం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్యాస్ బండ లేక ఆహారం తయారు చేయలేదంటూ వంట సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రోగులువాపోతున్నారు. ఆరు నెలల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో చేసేదేమీ లేక బంధువులే.. ఇంటి వద్ద నుండి భోజనం తెచ్చుకొని రోగులకు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కాంట్రాక్టర్ స్పందిచకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.