సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి, ఆక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. స్థానిక వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో సోమ వారం మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో సోమిరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై తాను త్వరలోనే నివేదిక విడుదల చేస్తానని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారని బీజేపీ వెంకటాచల మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపోకుల పెంచలయ్య ఇటీవల వెల్లడించారని గుర్తు చేశారు. ఆ విషయాలతో కాని, అతనితో కాని తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కానీ.. ఆయనతో తానే మాట్లాడించినట్టు సోమిరెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి పెంచలయ్య మాతో మాట్లాడినట్లుగా నిరూపించాలి. అందుకోసం విచారణ కూడా చేయించుకోవాలి’ అని కాకాణి సూచించారు. తనపై కేసులు పెడితే భయపడేది లేదని, పోలీసులు, కేసులు, జైళ్లకు తాము భయపడేవాళ్లం కాదని అన్నారు. పోస్టులు అమ్మకునే బుద్ధి ఆయనకు గతంలోనే ఉందన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు, వీఓఏ పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదన్నారు.