కర్నూలు జిల్లా, రుద్రవరం మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై గురువారం ఉపాధి హమీ పథకం కార్యాలయంలో పీడీ రామచంద్రరెడ్డి సమక్షంలో మండల స్థాయి బహిరంగ చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదికలో ప్రజల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. 1279 పనులకు రూ. 9,92,64,136 ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిపై 11 మంది డీఆర్పీలు, ఒక ఎస్‌ఆర్‌పీ, 8 మంది వీఎస్‌ఏలు 13 రోజలు పాటు గ్రామాల్లో సామాజిక తనిఖీలు చేసి నిగ్గుతేల్చిన బహిరంగ చర్చవేదికలో ఇలా తే లాయి. ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా రూ.7500, రికవరీ రూ.98,382, రూ.3,22,300 విలువ చేసే పనులకు విచారణలో ఉంచారు. రీప్లాంటేషన కింద రూ.13,36,228 తేల్చారు. సామాజిక తనిఖీలో వెల్లడి కాని అంశాలు గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో వెల్లడయ్యాయి. గ్రామ వలంటీర్లకు వారా నికి మూడు రోజుల పనిదినాలు కల్పించాలని, అయితే ఇక్కడ ఎక్కువ పని దినాలు కల్పించారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. బుక్‌కీపర్లకు, ప్రైవేటు పాఠశాలల్లో పని చేసేవారికి, చనిపోయిన వారికి, వలంటీర్లకు, పనికి వెళ్లలేని వృద్ధులకు కూడా ఉపాధి పనిదినాలు కల్పించారని, అలాగే జాబ్ కార్డులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులకు పీడీ రామచంద్రారెడ్డి స్పందించి విచారణ అధికారిగా ఏపీడీ సాంబశివరావును నియమించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స అధికారి షీబారాణి, క్వాలిటీ కంట్రోల్ అధికారి గంగాధర్, డీపీఎం దానం, ఎంపీడీవో మధుసూదనరెడ్డి, ఏఈలు వెంకటరాముడు, నాగరాజు, సర్పంచ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.