గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయని, వాటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. వారి హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ వాసనలు పోని అధికారులపై చర్యలు ఉంటాయని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలంటూ మంత్రి సమీక్షలో హెచ్చరించారు.