బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శనివారం ఉదయం నుంచి వర్షాలపై పలు దఫాలుగా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సహాయచర్యలకు జిల్లాకు రూ.3 కోట్లు, తీవ్రత తక్కువున్న జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున తక్షణసాయం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే, వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందజేయాలని సూచించారు. శ్రీకాకుళం- విశాఖ మధ్య తుఫాను తీరం దాటనుందని, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తీరగ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. రాత్రంతా మెలకువతో ఉండైనా ప్రజల రక్షణ కోసం పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
హుద్‌హుద్ సమయంలో అనుసరించిన విధానం ప్రస్తుతం పాటించాలని అధికారులకు సూచించారు. నష్టం జరిగిన తర్వాత కాకుండా.. ఆ నష్టాన్ని తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో పటిష్ఠ ముందుస్తు చర్యల ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించామని చంద్రబాబు గుర్తుచేశారు. ‘వర్షాలు తగ్గేవరకూ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సీఎం పేర్కొన్నారు.
అలాగే, ప్రవాహాలకు ఉన్న నిర్మాణాలు, ఇతర అడ్డంకుల్ని పొక్లెయిన్‌తో యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు. నాలాలు తెరిచి ఉన్నచోట హెచ్చరికలు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ కొండచరియల ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. కొండప్రాంతాల్లో ఉన్నవారిని అవసరమైతే ఖాళీ చేయించాలని, ప్రజలు అధికారుల సూచనల్ని పాటించాలని కోరారు. తుఫాను పునరావాస కేంద్రాల్ని సిద్ధం చేసి, గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కాగా, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయి, ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై అధికారుల్ని వివరణ కోరారు. భారీవర్షాలు పడుతున్నా పాఠశాలకు ఎందుకు సెలవు ఇవ్వలేదు?.. అని ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత సెలవిచ్చినట్లు అధికారులు వివరించారు. దీనిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. భారీవర్షాలు ఉన్న జిల్లాల్లో వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా విద్యా సంస్థలకు ముందురోజే సెలవు ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటకుండా ప్రజల్ని నియంత్రించాలని, వాట్సప్ గ్రూపుల ద్వారా వివిధ శాఖల అధికారులు సంప్రదించుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇలాంటి సమయంలో డ్రోన్ సాంకేతికతను విరివిగా వాడుకోవాలని సూచించారు. విపత్తు శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలని, భారీవర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజల ఫోన్లకు సందేశాలు పంపి అప్రమత్తం చేయాలన్నారు.