విజయవాడ మునిగిపోవడానికి కారణం మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే విజయవాడ నగరం విలవిల్లాడుతోందన్న ఆయన, గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని స్పష్టం చేశారు. మరోవైపు వరద బాధితులనూ ఆదుకోవడం లేదని, వారికి కనీసం మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని, రిలీఫ్ క్యాంప్స్ లేవని, ఇంకా ఎలాంటి సహాయక చర్యలూ లేవని అన్నారు. విజయవాడ నగరంలోని పలు వరద ప్రాంతాలను వైయస్ జగన్ పరిశీలించారు. కొన్ని చోట్ల దాదాపు నడుంలోతు నీళ్లలో సైతం స్వయంగా నడిచిన వైయస్ జగన్, వరద బాధితులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కష్టాలు, వారికి అందిన సాయాన్ని ఆరా తీశారు. తిండి, నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బంది పడుతున్నా, కనీసం పట్టించుకున్న వారు లేరని, ఎక్కడికైనా వెళ్లిపోదామంటే, కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని విజయవాడ నగర బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. వారి బాధలు విన్న వైయస్ జగన్ వారికి ఓదార్పునిచ్చారు.