ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బిజాపుర దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ మృతిచెందారు. లావాపురంగేల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కోసం సీఆర్పీఎఫ్, డీఆర్జీ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్.. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భధ్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగి.. 10 మంది మావోయిస్ట్‌లు చనిపోయారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో 9 మంది నక్సల్స్ హతమైనట్టు పోలీస్ వర్గాలు ధ్రువీకరించాయి. ఘటనా స్థలిలో అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ.. ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫల్స్, 315 బోర్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ జరుగుతోందన్న ఎస్పీ... పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
తెల్లవారుజామున కూంబింగ్ ఆపరేషన్ మొదలైందని, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మావోయిస్ట్‌లు తారసపడ్డారని ఎష్పీ పేర్కొన్నారు. ఇక, ఆగస్టు 29న నారాయణ్‌పూర్ అబుజ్‌మడ్ ప్రాంతంలో జరిగిన జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు హతమయ్యారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. 2026 మార్చి నాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తా మని ప్రకటించారు. మావోయిస్ట్ తీవ్రవాదులపై తుది దాడికి నిర్ణాయక, కఠిన వ్యూహం అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. హింసావాదాన్ని వీడాలని, లొంగుబాట పట్టిన నక్సల్స్ పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒకట్రెండు నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.